ఇప్పుడిప్పుడే కెరియర్లో పురోగమిస్తూ, కుటుంబాలను ఏర్పర్చుకునే దశలో ఉన్న యువతకు సాధికారత కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తోడ్పడుతుందని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ఎండీ కమలేష్ రావు తెలిపారు. వాస్తవానికి 26–35 ఏళ్ల వయస్సు గ్రూప్‌లోని వారు దీర్ఘకాలికంగా ఆర్థిక భరోసాను కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కొంత వెనుకబడుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.
ఈ సర్వే ప్రకారం 2025 మార్చి ఆఖరు నాటికి ప్రతి నలుగురు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లలో ఈ వయస్సు గ్రూప్‌లోని వారు ఒకరే ఉంటున్నారని (మొత్తం పాలసీదారుల్లో 25.24 శాతం) వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇది చెప్పుకోతగిన స్థాయే అయినప్పటికీ 36–45 ఏళ్ల గ్రూప్ వారి వాటా అత్యధికంగా 41.68 శాతంగా, 46–55 ఏళ్ల గ్రూప్ వారి వాటా 23.96 శాతంగా ఉందని తెలిపారు.
ఈఎంఐలు, ఇతరత్రా ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మొదలైన వాటి కారణంగా అప్పుడప్పుడే కాస్త అధికంగా ఆర్జించడం మొదలుపెట్టిన వారు కీలకమైన కవరేజీని పెద్దగా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా బీమాకు సంబంధించి చిన్న వయస్సులో ప్రీమియంలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అదే వయస్సు పెరిగి అదే నలభైలు, యాభైల్లోకి వచ్చినప్పుడు ప్రీమియంలు పెరిగిపోతాయి.
ఈ విషయాలను యువతకు సమర్ధవంతంగా తెలియజేయడంతో పాటు బీమా కేవలం రక్షణ కవచంగానే కాకుండా ఆకాంక్షలను నెరవేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని బీమా సంస్థలు సైతం వివరించాల్సి ఉంటుందని కమలేష్ రావు చెప్పారు. ఇందుకోసం వెల్‌నెస్ బెనిఫిట్స్, పొదుపునకు ఉపయోగపడే రైడర్లు, జీవితంలోని దశలను బట్టి కాలవ్యవధులను మార్చుకునే ఆప్షన్లు మొదలైనవి ఆఫర్ చేయాల్సి ఉంటుందన్నారు.


