ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో, ప్రమాదాల తీరు కూడా అంతే వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ప్రధానంగా ఉంటే ఇప్పుడు సైబర్ ప్రమాదాలు (Cyber Risks) సవాలుగా మారుతున్నాయి. చిన్న స్టార్టప్ నుంచి పెద్ద ఐటీ సంస్థల వరకు.. ప్రతి ఒక్కరి డిజిటల్ కార్యకలాపాలు పెరిగే కొద్దీ సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలకు, టెక్ సంస్థలకు ఆర్థిక భద్రతను అందించేందుకు బీమా రంగం సైబర్ ఇన్సూరెన్స్‌ను (Cyber Insurance) తీసుకువస్తోంది. ఇప్పటికే టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్ అలయన్స్ వంటి సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి.
సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
సైబర్ ఇన్సూరెన్స్ లేదా సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఒక సంస్థ లేదా వ్యక్తి సైబర్ దాడి, డేటా ఉల్లంఘన (Data Breach), హ్యాకింగ్ లేదా మాల్వేర్ వంటి డిజిటల్ ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను కవర్ చేయడానికి రూపొందించిన బీమా పాలసీ. ఇది సాధారణ బీమా లాంటిది కాదు. ప్రత్యేకంగా కంప్యూటర్ వ్యవస్థలు, డేటా, నెట్‌వర్క్ భద్రతకు సంబంధించిన నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది.
ఉపయోగాలు, కంపెనీలకు తోడ్పాటు
సైబర్ దాడి కారణంగా వ్యాపార కార్యకలాపాలు ఆగిపోవడం వల్ల కలిగే ఆదాయ నష్టం, వ్యవస్థలను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చులు (ఉదాహరణకు, ఐటీ సిస్టమ్స్ రిపేర్, డేటా రికవరీ), క్రిమినల్ ఫోరెన్సిక్ నిపుణుల ఖర్చులు వంటి వాటిని ఈ బీమా కవర్ చేస్తుంది.
డేటా ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభావితమైన కస్టమర్‌లకు నోటిఫై చేయడం, జరిమానాలు చెల్లించడం, చట్టపరమైన ఫీజులు, సెటిల్‌మెంట్‌లకు అయ్యే ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది.
కొన్ని పాలసీలు సైబర్ దాడి జరిగిన వెంటనే స్పందించడానికి సైబర్ నిపుణులు, న్యాయ సలహాదారులు, పబ్లిక్ రిలేషన్స్ (PR) నిపుణులతో కూడిన బృందాన్ని అందించడంలో సహాయపడతాయి.
సైబర్ దాడి వల్ల దెబ్బతిన్న కంపెనీ ప్రతిష్టను పునరుద్ధరించడానికి, మీడియా నిర్వహణకు అయ్యే ఖర్చులను కూడా ఈ బీమా కవర్ చేస్తుంది.
ఐటీ మౌలిక సదుపాయాలపై దాడులు
ర్యాన్సమ్‌వేర్ దాడులు అత్యంత సాధారణ దాడులు. ఇందులో హ్యాకర్లు కంపెనీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి దాన్ని తిరిగి ఇవ్వడానికి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. టార్గెట్ సర్వర్‌కు లేదా నెట్‌వర్క్‌కు భారీ మొత్తంలో ట్రాఫిక్‌ను పంపి వ్యవస్థ పనిచేయకుండా అడ్డుకుంటారు. ఇది వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేస్తుంది.
ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఉద్యోగులను మోసగించి వారి నుంచి సున్నితమైన లాగిన్ వివరాలు లేదా డేటాను సేకరిస్తారు. డేటా ఉల్లంఘన కింద కస్టమర్ లేదా కంపెనీ గోప్యమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా లీక్ చేస్తారు.
పునరుద్ధరణ ఖర్చులు
సైబర్ దాడి తర్వాత వ్యవస్థలను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చు ఆ దాడి రకాన్ని బట్టి, కంపెనీ పరిమాణాన్ని బట్టి మారుతుంది. ఫోరెన్సిక్ విశ్లేషణలో దాడి మూలాన్ని, దాని ప్రభావాన్ని గుర్తించడానికి నిపుణులకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దెబ్బతిన్న సర్వర్‌లు, నెట్‌వర్క్ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను రిపేర్ చేయాలి. కోల్పోయిన డేటాను తిరిగి పొందడానికి ఖర్చు అవుతుంది. ర్యాన్సమ్‌వేర్ దాడిలో హ్యాకర్లకు డబ్బు చెల్లించాల్సి రావొచ్చు(కొన్ని పాలసీలు మాత్రమే కవర్ చేస్తాయి).
క్లెయిమ్ విధానం
సైబర్ దాడి లేదా డేటా ఉల్లంఘన జరిగినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా సంఘటన వివరాలను బీమా కంపెనీకి తెలియజేయాలి. పాలసీలో పేర్కొన్న సమయ పరిమితి (సాధారణంగా 24 నుండి 72 గంటలు) లోపు బీమా కంపెనీకి అధికారికంగా వెల్లడించాలి.
చాలా కంపెనీలు 24/7 హెల్ప్‌లైన్లను అందిస్తాయి. దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో లేదా సైబర్ సెల్‌లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్ కాపీని బీమా సంస్థకు సమర్పించాలి.
దాడికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు, ఐటీ నివేదికలు, కమ్యూనికేషన్ లాగ్స్, నష్టం అంచనా నివేదికలతో సహా అన్ని కీలక పత్రాలను సేకరించి క్లెయిమ్ ఫారంతో పాటు సమర్పించాలి.
బీమా సంస్థ తరఫున వచ్చే రిస్క్ అసెసర్ (Risk Assessor), ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి పూర్తి సహాయం అందించాలి. క్లెయిమ్ చెల్లుబాటును నిర్ధారించడానికి ఈ విశ్లేషణ చాలా అవసరం.
అన్ని పత్రాలు, విశ్లేషణ నివేదికలు పరిశీలించిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నష్టపరిహారాన్ని అందిస్తుంది. పాలసీ తీసుకునే ముందు అన్ని నియమ నిబంధనలను నిశితంగా పరిశీలించాలని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టే ఎగుమతి ప్రోత్సాహక మిషన్


