ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.
ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్‌లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్‌డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.
‘పే హౌ యు లివ్’ అంటే..
సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్‌నెస్ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్‌లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.
2025లో వచ్చిన మార్పులు
ఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్‌డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.
ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్‌నెస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.
గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.
వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్‌ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.
స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.
ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు
భారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.
ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వెల్‌నెస్ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.
సవాళ్లు
ఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్‌డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్‌కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్‌నెస్ పార్టనర్‌గా రూపాంతరం చెందుతోంది.
ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..


