‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడంటే.. | Universal Studios planning stages to build theme park know details | Sakshi
Sakshi News home page

‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..

Dec 24 2025 4:48 PM | Updated on Dec 24 2025 4:54 PM

Universal Studios planning stages to build theme park know details

ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

334 చదరపు కిలోమీటర్లు

ఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.

పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీ

సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement