ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.
ఈ విమానం ప్రత్యేకతలు
7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.
‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.
నిధుల సేకరణ
ఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
తదుపరి దశ ఏమిటి?
గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్‌లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.
ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!


