సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్‌లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.
సాహసోపేత అడుగు
2023లో స్థాపించిన ఈ ఇంజిన్‌ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్‌వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్‌ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
ఏఐ సూపర్ పవర్
ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.
Oh my god! Sci-fi movie becomes reality in China!
⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011
⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025
China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025
టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్‌పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్‌కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: రూపాయికి ఆర్‌బీఐ రక్షణ కవచం


