రూపాయికి ఆర్‌బీఐ రక్షణ కవచం | Key Details of RBI Liquidity Plan regarding rupee stabilisation | Sakshi
Sakshi News home page

రూపాయికి ఆర్‌బీఐ రక్షణ కవచం

Dec 24 2025 3:09 PM | Updated on Dec 24 2025 3:35 PM

Key Details of RBI Liquidity Plan regarding rupee stabilisation

భారత రూపాయి విలువ గత కొన్ని నెలలుగా ఒత్తిడికి లోనవుతోంది. అందుకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. వంటివి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో రూపాయి మరింత నేలచూపులు చూడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చురుకైన చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.91 మార్కును తాకి స్వల్పంగా పుంజుకుంది. ఈ తీవ్ర ఒడిదుడుకులను అరికట్టడానికి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగించి మార్కెట్‌లో డాలర్లను విక్రయిస్తోంది.

ఆర్‌బీఐ జోక్యం

తాజా అధికారిక సమాచారం ప్రకారం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ భారీ స్థాయిలో డాలర్లను విక్రయించింది. అక్టోబర్ నెలలో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించింది. రూపాయి విలువ రూ.89 మార్కును దాటకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ పరిస్థితులు దృష్ట్యా రూపాయి విలువ  రూ.91కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఆర్‌బీఐ దాదాపు 34.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.91 లక్షల కోట్లు) విలువైన డాలర్లను అమ్మి రూపాయి పతనాన్ని అడ్డుకుంది. డిసెంబర్ 12, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 688.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఉన్న 704 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఇవి దేశానికి పటిష్టమైన రక్షణను కల్పిస్తున్నాయి.

రూపాయి బలహీనపడటానికి కారణాలు

  • ట్రంప్ ప్రభుత్వ సుంకాల పెంపు భారత ఎగుమతులపై ప్రభావం చూపడం రూపాయి బలహీనతకు ఒక కారణం.

  • ఈ ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.

  • అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశం ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి రావడం రూపాయి విలువను తగ్గిస్తోంది.

ఆర్‌బీఐ చర్యల పర్యావసానాలు

రూపాయి ఒక్కసారిగా పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువుల (పెట్రోల్, ఎలక్ట్రానిక్స్) ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకశం ఉంది. ఆర్‌బీఐ జోక్యం వల్ల ఈ ధరలు అదుపులో ఉంటాయి. రూపాయి విలువ మరీ అస్థిరంగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఆందోళన చెందే ప్రమాదం ఉంటుంది. ఆర్‌బీఐ నియంత్రణ వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.

ప్రతికూలతలు

డాలర్లను విక్రయించడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆటంకం కావచ్చు. ఆర్‌బీఐ డాలర్లను అమ్మడం వల్ల మార్కెట్‌లో నగదు లభ్యత తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు ఆర్‌బీఐ ఇటీవల రూ.2.90 లక్షల కోట్ల లిక్విడిటీ లభ్యత చర్యలను ప్రకటించింది.

భారత రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఆర్‌బీఐ తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలతో రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం రూపాయి విలువను పెంచడం కంటే, మార్కెట్‌లో తీవ్రమైన అస్థిరత లేకుండా చూడటమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement