క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ సుమారు రూ. 11,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదిలో కంపెనీ లిస్టయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఐపీవో సజావుగా సాగితే కార్యకలాపాలు ప్రారంభించిన అత్యంత తక్కువ వ్యవధిలోనే లిస్టయిన యువ అంకుర సంస్థగా జెప్టో నిలుస్తుంది.
అలాగే పోటీ సంస్థలు జొమాటో, స్విగ్గీ సరసన కూడా చోటు దక్కించుకుంటుంది. 10 నిమిషాల్లో డెలివరీ సర్వీసుల పేరిట ప్రారంభమైన జెప్టో 7 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటివరకు ఇన్వెస్టర్ల నుంచి రూ. 16,000 కోట్లు సమీకరించింది.
2023 ఆగస్టులో 200 మిలియన్ డాలర్ల సమీకరణ ద్వారా యూనికార్న్ (బిలియన్ డాలర్ల కంపెనీ) హోదా దక్కించుకుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్‌అవుట్స్ అయిన ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా కలిసి దీన్ని నెలకొల్పారు. 2025 సెపె్టంబర్ నాటికి కంపెనీకి 900 డార్క్ స్టోర్స్ ఉన్నాయి.


