ఐదు కంపెనీల లిస్టింగ్‌ బాట | Snapshot latest IPO listings in India | Sakshi
Sakshi News home page

ఐదు కంపెనీల లిస్టింగ్‌ బాట

Feb 17 2026 2:34 PM | Updated on Feb 17 2026 2:38 PM

Snapshot latest IPO listings in India

రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..

కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ 2025 బాటలో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. తాజాగా సెబీ ఐదు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. జాబితాలో విరూపాక్ష ఆర్గానిక్స్, డ్యురోఫ్లెక్స్, ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్, ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌ కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కాగా.. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే.  

ఆర్‌అండ్‌డీ ఫార్మా

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్‌ ఐపీవోకు వస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అయితే ఐపీవోకు ముందుగా రూ. 148 కోట్ల విలువైన ప్లేస్‌మెంట్‌కు వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పరిశోధన– అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఆధారిత ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా నిలుస్తోంది. సంబంధిత ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీ చేపడుతోంది.

పరుపుల తయారీ

పరుపుల తయారీలో సుప్రసిద్ధమైన డ్యురోఫ్లెక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 184 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.25 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ముంబై కంపెనీ 120 సొంత, నిర్వహణా స్టోర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. అంతేకాకుండా ప్రస్తుత కోకో స్టోర్ల లీజ్, రెంట్, లైసెన్స్‌ ఫీజులతోపాటు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సైతం వినియోగించనుంది. 1963లో ఏర్పాటైన డ్యురోఫ్లెక్స్‌ మార్కెట్‌ వాటా రీత్యా దేశీయంగా పరుపుల తయారీలోని టాప్‌–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఫర్నీచర్‌సహా బెడ్డింగ్‌ సంబంధిత ప్రొడక్టులను సైతం తయారు చేస్తోంది.

విస్తరణపై దృష్టి

వెల్డింగ్‌ కన్జూమబుల్స్‌ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీ చేపట్టే ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 2.25 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను హోనడ్, ఖాలాపూర్‌(మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌) వద్ద కొత్తగా వైర్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు.. వాడా, పాల్ఘర్‌(మహారాష్ట్ర)లోగల యూనిట్‌ విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది.  

వెల్‌నెస్‌ ప్రొడక్టులతో

విభిన్న మైక్రోన్యూట్రియంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. 1993లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా వివిధ మైక్రోన్యూట్రియంట్‌ ప్రీమిక్స్‌లతోపాటు.. బ్రాండెడ్‌ వెల్‌నెస్, క్లినికల్‌ న్యూట్రిషన్, థరెప్యూటిక్‌ ఫార్ములేషన్స్, వినియోగానికి సిద్ధంగా ఉండే(రెడీ టు యూజ్‌) ఆహారోత్పత్తులను తయారు చేస్తోంది.

పెట్టుబడి వ్యయాలకు

హైవోల్టేజీ, ఎక్స్‌ట్రా హైవోల్టేజీ విద్యుత్‌ ప్రసార లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసే ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా 90 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 10 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లతోపాటు.. భూగర్భ కేబుళ్ల ప్రాజెక్టులు, సమీకృత నిర్వహణా సర్వీసులు తదితర కార్యకలాపాలు సైతం చేపడుతోంది.

ఇదీ చదవండి: ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement