2026–27లో 12,000 కోట్లకు పరిమితం కావచ్చు
ఈసారి రూ. 17,000 కోట్లుగా ఉండొచ్చు
రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా
దేశీ ఏవియేషన్ పరిశ్రమకు సానుకూల ఔట్‌లుక్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల నష్టాలు గణనీయంగా తగ్గొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో నష్టాలు ఉండొచ్చని, ఇవి 2026–27లో రూ. 11,000–12,000 కోట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటం, విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంలాంటి సానుకూల అంశాల కారణంగా ఏవియేషన్ పరిశ్రమకు స్థిరమైన అవుట్‌లుక్ కొనసాగిస్తున్నట్లు ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది.
2026–27లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 6–8 శాతం పెరిగి 17.5–17.9 కోట్లకు చేరొచ్చని తెలిపింది. ఇటీవలే ఈ ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీ అంచనాలను 4–6 శాతం స్థాయి నుంచి 0–3 శాతానికి ఇక్రా సవరించింది. ‘‘భారత ఏవియేషన్ పరిశ్రమ 2024–25లో రూ. 5,500 కోట్లు, 2025–26లో అంతకన్నా అధికంగా రూ. 17,000–18,000 కోట్లకు నష్టాలు పెరగనున్నాయి. అయితే, పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్య దన్నుతో 2026–27లో ఇవి రూ. 11,000–12,000 కోట్లకు తగ్గొచ్చు. అలాగే 2025–2026లో ఫ్లయిట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రాగలవు’’ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు.
నివేదిక ప్రకారం..
→ సీమాంతర ఉద్రిక్తతలు, విమాన దుర్ఘటన, డిసెంబర్‌లో ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాలు తదితర అంశాల కారణంగా వార్షిక ప్రాతిపదికన 2025–26 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పరిశ్రమ రాబడులు క్షీణించాయి. కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం, ఫ్లయిట్ల రద్దు.. జాప్యాలవల్ల నిర్వహణ వ్యయాలు పెరగడంలాంటి సవాళ్ల మధ్య కూడా కంపెనీలు రాబడి స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడంతో ఆదాయం తీవ్ర స్థాయిలో క్షీణించలేదు.
→ తాత్కాలిక అంతరాయాలు నెమ్మదించే కొద్దీ సమీప భవిష్యత్తులో రాబడులు మెరుగుపడొచ్చు. అయితే, విమాన ఇంధనం ధరలు,
డాలరు–రూపాయి మారకం రేటును నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
→ 2025 క్యాలెండర్ సంవత్సరంలో కొత్తగా విమానాల సంఖ్య 4 శాతం పెరగడంతో 2025 డిసెంబర్ 31 నాటికి మొత్తం విమానాల సంఖ్య 865కి చేరింది. వివిధ విమానయాన సంస్థలు భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. 2026 జనవరి 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మొత్తం 1,700 పైచిలుకు విమానాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 10 ఏళ్లలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఇందులో ఎక్కువ శాతం విమానాలు పాతబడిన వాటి స్థానాన్ని భర్తీ చేసేవిగానే ఉండనున్నాయి.
→ వివిధ కారణాల రీత్య పలు విమానాలను పక్కన పెట్టాల్సి రావడమనేది గత కొన్నేళ్లుగా పరిశ్రమకు సమస్యాత్మకంగా మారింది. ఇంజిన్ల వైఫల్యం, సరఫరా వ్యవస్థపరమై సవాళ్లతో 2023 సెపె్టంబర్ నాటికి పక్కన పెట్టిన విమానాల సంఖ్య పరిశ్రమలోని మొత్తం విమానాల్లో 20–22 శాతంగా నమోదైంది. ఇది 2026 ఫిబ్రవరి నాటికి 13–15 శాతానికి (సుమారు 117 ఎయిర్‌క్రాఫ్ట్‌లు) దిగి వచి్చంది. ఇలా పక్కన పెట్టిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య తగ్గుతూ, కొత్త విమానాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా కూడా మరింత
మెరుగుపడనుంది.


