
మొత్తం ఉత్పత్తి 8 శాతం డౌన్
ఇక్రా రేటింగ్స్ తాజా అంచనా
న్యూఢిల్లీ: అధికస్థాయిలో యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల తయారీని దెబ్బతీయనున్నట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే భారత్ నుంచి ఆటో విడిభాగాలను ఎగుమతి చేసే సంస్థలకు ఇది ప్రతికూలంగా పరిణమించనున్నట్లు తెలియజేసింది. ఇది భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ప్రాధాన్యతను పట్టి చూపుతున్నట్లు పేర్కొంది.
ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో 30 శాతం ఎగుమతులనుంచే లభిస్తున్నట్లు తెలియజేసింది. దీనిలో ఒక్క యూఎస్ నుంచే 27 శాతం సమకూరుతున్నట్లు వివరించింది. వెరసి ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల ఉత్పత్తిపై ప్రత్యక్షంగా 8 శాతం ప్రభావాన్ని చూపనున్నట్లు ఇక్రా తాజాగా అంచనా వేసింది. 15–30% టారిఫ్‌లను ఎదుర్కొంటున్న చైనా, జపాన్, వియత్నాం, ఇండొనేసియా తదితర ఆసియా దేశాలతో పోల్చితే భారత్ ఎగుమతిదారులకు ప్రతికూలమేనని తెలియజేసింది.