H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్‌గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో..
చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు..
ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది.
టెక్సాస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.
ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్‌ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్‌లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్‌లో సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను కూడా కఠినతరం చేసింది.
ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది.


