వివాహమా?.. ఇప్పుడే వద్దులే!  | Median age for marriage among Indian singles has risen from 27 to 29 | Sakshi
Sakshi News home page

వివాహమా?.. ఇప్పుడే వద్దులే! 

Feb 13 2026 1:10 AM | Updated on Feb 13 2026 1:10 AM

Median age for marriage among Indian singles has risen from 27 to 29

భారత్‌లో 29 ఏళ్లకు పెరిగిన సగటు పెళ్లి వయసు  

ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడ్డాకే యువత నిర్ణయం  

తగ్గిపోతున్న కులం పట్టింపు... 

‘జీవన్‌సాథీ’అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ:  వివాహం చేసుకోవడానికి యువత తొందరపడడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కెరీర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో లేక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. భారత్‌లో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లు కాగా.. అది ఇప్పుడు 29 ఏళ్లకు చేరుకుంది. అంటే సగటున 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. 

వివాహ పరిచయ వేదిక ‘జీవన్‌సాథీ’నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. వివాహాలపై 2016 నుంచి 2025 దాకా ప్రజల్లో మారిన ధోరణిని అధ్యయనం చేశారు. అలాగే ఈ ఏడాది 30 వేల మంది అభిప్రాయాలు సైతం సేకరించారు. ‘అతిపెద్ద మార్పు: జీవిత భాగస్వామి ఎంపిక, పెళ్లి విషయలో నిబంధనలు తిరగరాస్తున్న భారత్‌’ఒక నివేదికను జీవన్‌సాథీ తాజాగా విడుదల చేసింది. 

ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి.  
→ పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కానీ, అందుకోసం తొందర పడడం లేదు. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తున్నారు.  

→ ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక కోణమే కీలకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కుదురుకొని ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్చన్నది యువత ఆలోచన. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాపురంలో కలతలు రేగుతుంటాయి. ఆ పరిస్థితి రావొద్దని నేటి యువత భావిస్తోంది.  

→ పెళ్లిని వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా కొందరు భావిస్తున్నారు. అందుకే అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత పెళ్లి ఆలోచన తీసుకొస్తున్నారు.  

→ జీవిత భాగస్వామి మృతిచెందడం లేదా తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య దేశంలో పెరుగుతోంది.  

→ 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది.  

→ విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకొస్తుండడం గమనార్హం.  

→ సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పెళ్లి విషయంలో వయసు, ఆదాయం వంటి వాటికి ప్రాధాన్యం లేదని, ‘రైట్‌ పర్సన్‌’కావాలని, అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తామని అంటున్నారు.  

→ కులం పట్టింపు తగ్గిపోతుండడం మరో శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది.  

→ పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.  

→ భార్య తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ యువకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement