బ్యాంకుల ఆరోగ్యం ఎంతో మెరుగు | RBI latest Report on Trend and Progress of Banking in India | Sakshi
Sakshi News home page

బ్యాంకుల ఆరోగ్యం ఎంతో మెరుగు

Dec 31 2025 7:41 AM | Updated on Dec 31 2025 7:43 AM

RBI latest Report on Trend and Progress of Banking in India

బ్యాలన్స్‌ షీటులు పటిష్టం

రుణాలు, డిపాజిట్లలో వృద్ధి

ఆర్‌బీఐ నివేదిక వెల్లడి

బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఎంతో మెరుగుపడినట్టు ఆర్‌బీఐ నివేదిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా వసూలు కాని నిరర్థక ఆస్తులు (రుణాలు) 2025 మార్చి చివరికి దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 2.2 శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. బలమైన బ్యాలన్స్‌ షీటు, స్థిరమైన లాభదాయకత, మెరుగుపడిన ఆస్తుల నాణ్యతతో బ్యాంకింగ్‌ రంగం 2024–25లో బలంగా నిలిచినట్టు పేర్కొంది. 

రుణాలు, డిపాజిట్లు డబుల్‌ డిజిట్‌ స్థాయిలో పెరిగాయని, మూలధన, మిగులు నిల్వలు నియంత్రణ పరిమితులకు ఎగువనే ఉన్నట్టు వెల్లడించింది. దీనికి వివేకవంతమైన నియంత్రణలు కలసి స్థిరమైన రుణ వితరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నట్టు తెలిపింది. అన్ని వాణిజ్య బ్యాంకుల లాభం గత ఆర్థిక సంవత్సరంలో 14.8 శాతం పుంజుకుని రూ.4.01 లక్షల కోట్లకు చేరుకుంది. 2023–24లో లాభం ఏకంగా 32.8 శాతం వృద్ధి చెంది రూ.3.5 లక్షల కోట్లకు చేరడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 

2023–24తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో లాభాల వృద్ధి జోరు తగ్గనప్పటికీ, మెరుగైన పనితీరు నమోదైనట్టు తెలిపింది. ఆస్తులపై రాబడి (ఆర్‌వోఏ) 1.4 శాతంగా, మూలధనంపై రాబడి (ఆర్‌వో) 13.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. పట్టణ సహకార బ్యాంకుల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైనట్టు తెలిపింది. వాటి ఆస్తుల నాణ్యత వరుసగా నాలుగో ఏడాదీ మెరుగుపడినట్టు వెల్లడించింది. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు రుణాల్లో డబుల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేశాయని, నిధుల నిల్వలు సమృద్ధిగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడినట్టు పేర్కొంది.

తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులు విక్రయించొద్దు..

కస్టమర్లను తప్పుదోవ పట్టించి ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడాన్ని నిరోధించేందుకు ఆర్‌బీఐ పూర్తిస్థాయి నిబంధనలను విడుదల చేయనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. తన నియంత్రణలోని ఆర్థిక సంస్థలు (బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు) ఆర్థిక ఉత్పత్తులు, సేవలను ఏదో రకంగా విక్రయించే చర్యలు అటు కస్టమర్లకు, ఇటు ఆర్థిక రంగానికి చేటు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. రుణ వసూలు ఏజెంట్లకు సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించి, ఈ దిశగా సామరస్యపూర్వక నిబంధలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. డిజిటల్, సైబర్‌ మోసాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు బలమైన అంతర్గత నియంత్రణలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆర్థిక ఆవిష్కరణలు, ప్రజా విశ్వాసం పెరుగుదల మధ్య సమతుల్యం, సుస్థిర అభివృద్ధి అన్నవి ఆర్‌బీఐ విధానాల్లో ఇక ముందూ ప్రముఖంగా కొనసాగుతాయని పేర్కొంది.

తగ్గిన మోసాలు..

2024–25లో బ్యాంకులు నివేదించిన సమాచారం ఆధారంగా మొత్తం మీద ఆర్థిక మోసాలు తగ్గినట్టు ఈ నివేదిక వెల్లడించింది. కార్డులు/ఇంటర్నెట్‌ మోసాలు మొత్తం మోసాల్లో 66.8 శాతంగా ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మోసాల కేసుల్లో 59.3 శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే నమోదయ్యాయి. మోసాల విలువ పరంగా చూస్తే 70.7 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.

ఇదీ చదవండి: జీమెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement