వీకెండ్ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్‌ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్ హోమ్స్ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్‌లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో
ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.
ఎవరు కొంటున్నారంటే..
విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.
అద్దెకు కూడా..
వీకెండ్ హోమ్స్ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.
ఈ ప్రాంతాలలో డిమాండ్..
నగరం ఓఆర్‌ఆర్ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్‌పల్లి, జహీరాబాద్ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.
కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్ హోమ్స్‌ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.


