
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాలు
ఈ ఏడాది 10.5 శాతం రుణ వృద్ధి
ముంబై: చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్‌ఎంఈలు) రుణాలలో రిస్‌్కకు వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు కనిష్టస్థాయికి చేరాయని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను నిలువరిస్తే ఇవి మరింత తగ్గకపోవచ్చునని తెలియజేసింది. రుణ వృద్ధి మందగిస్తే మాత్రమే రేట్ల తగ్గింపునకు వీలుంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వృద్ధి 10.5 శాతంగా నమోదుకానున్నట్లు తెలియజేసింది.
ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 15–17 శాతం వృద్ధి చూపనున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం బ్యాంకింగ్ దిగ్గజాలు ఏడాది కాలావధి డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రస్తావించింది. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థకు స్థిరత్వం(నిలకడ)తో కూడిన ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. పెరగనున్న వినియోగం, యూఎస్ తుది టారిఫ్‌లు, వాటి ప్రభావం, మందగమన వృద్ధితో ఉపాధి మార్కెట్‌పై ప్రభావం, ఆస్తుల(రుణాల) నాణ్యతా ఆందోళనలు తదితరాలను గమనించదగ్గ కీలక అంశాలుగా పేర్కొంది.
ఒత్తిళ్ల సంకేతాలు
రూ. 25 లక్షలలోపు రుణాలు పొందిన ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియో నుంచి చెల్లింపుల్లో ఒత్తిడి ఎదురవుతున్నట్లు ఇక్రా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అనిల్ గుప్తా పేర్కొన్నారు. ప్రొప్రయిటరీషిప్ కంపెనీల నుంచి రుణ చెల్లింపుల్లో ఒత్తిడి సంకేతాలు రుణదాతలకు కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్‌బీఎఫ్‌సీ రుణదాతలకు హామీతోకూడిన, హామీలేని ఎస్‌ఎంఈ రుణాలలో (రుణ)నష్టాలు నమోదవుతున్నట్లు వివరించారు. 2025 మార్చిలో అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 3.4 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
దీనికితోడు యూఎస్ టారిఫ్‌లు ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం చూపితే అధిక ఈల్డ్‌తోకూడిన, తక్కువస్థాయి రుణాలపై మరింత ఒత్తిడి పెరగనున్నట్లు అభిప్రాయపడ్డారు. 20 శాతానికంటే అధిక రుణ రేట్లుగల రుణాలపై ఈ ప్రభావం అధికంగా కనిపించనున్నట్లు వివరించారు. యూఎస్ టారిఫ్‌లతో ఎన్‌బీఎఫ్‌సీలకంటే బ్యాంకులపైనే ప్రతికూల ప్రభావం పడనున్నట్లు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఏఎం కార్తీక్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు రుణాలందించడం ఇందుకు కారణంకానున్నట్లు తెలియజేశారు. అయితే వీటి వాటా తక్కువకావడంతో బ్యాంకులపై ఒత్తిడి నెలకొనే అవకాశంలేదని అభిప్రాయపడ్డారు.