కీలక రిస్క్ ల్లో డేటా గోప్యత కూడా
ఏయాన్ నివేదికలో వెల్లడి...
ముంబై: నిపుణుల కొరత, నియంత్రణలపరమైన సంక్లిష్టత, డిజిటల్ సవాళ్ల నడుమ సైబర్ ముప్పులు, డేటా గోప్యతను ఈ ఏడాది అత్యంత రిస్కీ వ్యవహారాలుగా దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. సైబర్ దాడులు, డేటా చౌర్యం భయాలు టాప్ రిస్క్ గా కొనసాగుతుండగా, తాజాగా డేటా గోప్యత నిబంధనలు కూడా ఆ జాబితాలోకి చేరినట్లు అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్వీసుల సంస్థ ఏయాన్ ఒక సర్వే నివేదికలో తెలిపింది.
ప్రతిభావంతులను నియమించుకోవడం, వారు కంపెనీని వీడిపోకుండా చూసుకోవడానికి సంబంధించిన సవాళ్లు కొనసాగుతున్నాయని వివరించింది. ఆసియాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ’ప్రాపర్టీ నష్టాలు’, ’విదేశీ మారకం రేటులో ఒడిదుడుకుల’ రిస్క్ లు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు వివరించింది. ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనడంలో భారతీయ కంపెనీలు విశేషంగా రాణిస్తున్నాయని ఏయాన్ సీఈవో (ఇండియా) రిషి మెహ్రా తెలిపారు.
సైబర్ దాడులు, డేటా గోప్యత రిస్క్ ల పెరుగుతున్న కొద్దీ వాటిని దీటుగా ఎదుర్కొనేలా కంపెనీలు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని మెహ్రా పేర్కొన్నారు. ఇందుకోసం పటిష్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయడం, పురోగామి ఆలోచనా ధోరణిని పెంపొందించుకోవడం ద్వారా సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి భారతీయ కంపెనీలు బైటపడగలవని, దీర్ఘకాలికంగా విజయాలు సాధించేందుకు తమను తాము సిద్ధం చేసుకోగలవని వివరించారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ సర్వేలో భారత్ సహా 63 దేశాల నుంచి 3,000 మంది పైగా రిస్క్ మేనేజర్లు, చీఫ్‌ల హోదా గల ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.


