పాకిస్థాన్‌ వ్యవస్థలకు డిజిటల్ షాక్! | Indian Cyber Force group announced leaked sensitive data of Pakistani govt | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ వ్యవస్థలకు డిజిటల్ షాక్!

Nov 21 2025 12:26 PM | Updated on Nov 21 2025 12:54 PM

Indian Cyber Force group announced leaked sensitive data of Pakistani govt

సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్‌పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్‌కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్‌ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్‌ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.

ఏమేమి లీక్ అయ్యాయి?

‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.

పోలీసు రికార్డులు, పాస్‌పోర్ట్‌ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్‌పోర్ట్‌ వివరాలు బహిర్గతమయ్యాయి.

ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్‌ రికార్డులు ఉన్నాయి.

రైల్వే: పాకిస్థాన్‌ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్‌మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.

విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్‌వర్డ్‌లు) బహిర్గతమైంది.

విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.

ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్‌వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌ అధికారిక వెబ్‌సైట్ల సర్వర్లపై రాన్సమ్‌వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్‌లను ఎన్‌క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.

వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యం

ఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.

ఆర్థిక అనిశ్చితి ప్రభావం

ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్‌డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.

పౌరుల గోప్యతకు ప్రమాదం

ఈ లీక్‌ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్‌, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.

ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్‌పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.

ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement