పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర | Pakistan is facing an economic crisis over the hike in chai and sugar prices | Sakshi
Sakshi News home page

పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర

Jan 3 2026 7:32 PM | Updated on Jan 4 2026 8:33 AM

Pakistan is facing an economic crisis over the hike in chai and sugar prices

ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!

పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్‌తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్‌కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్‌లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్‌ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.


పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్‌తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్‌లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్‌కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్‌లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.

ఇక పాకిస్థాన్‌లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్‌లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఇక పాకిస్థాన్‌లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. 

::: హెచ్‌.కమలాపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement