‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్‌మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్‌ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి.
సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది.
కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.
(చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..)


