రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ.. | Ukrainian Valentyn Frechka: The transformation of fallen leaves into eco paper | Sakshi
Sakshi News home page

Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..

Nov 16 2025 11:06 AM | Updated on Nov 16 2025 11:21 AM

Ukrainian Valentyn Frechka: The transformation of fallen leaves into eco paper

ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్‌  ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్‌కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!

ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్‌  ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్‌ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. 

ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్‌ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్‌ పేపర్‌’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్‌ పేపర్‌ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. 

అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్‌  వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్‌ గ్రైండింగ్‌ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్‌గా మలుస్తున్నాడు. ఈ పేపర్‌తో బ్యాగులు, బాక్సులు, కార్డ్‌బోర్డులు వంటి ప్యాకేజింగ్‌ వస్తువులు తయారు చేస్తున్నాడు. 

యుద్ధం మధ్యలో కూడా
చిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్‌ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్‌  యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్‌కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్‌ అంతటా పలు బ్రాండ్‌లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్‌ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్‌ ఫ్రెచ్కా యూరోపియన్‌  ఇన్వెంటర్‌ అవార్డు 2024లో ‘యంగ్‌ ఇన్వెంటర్స్‌ ప్రైజ్‌’ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. 

వాలెంటిన్‌  ఇప్పుడు ఫ్రూట్‌ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్‌గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. 

(చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్‌! హీరో మాధవన్‌ సైతం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement