ఉక్రెయిన్ సైన్యానికి చిక్కిన గుజరాత్ వాసి వినతి
రష్యా వచ్చే యువకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్‌లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లాడు.
అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్‌ఫోన్‌కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు.
యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు.


