న్యూస్టార్ట్‌ చర్చలకు అమెరికా, రష్యా ఓకే | Russia and U.S. Agree on Need for New Nuclear Arms Treaty | Sakshi
Sakshi News home page

న్యూస్టార్ట్‌ చర్చలకు అమెరికా, రష్యా ఓకే

Feb 7 2026 4:49 AM | Updated on Feb 7 2026 4:49 AM

మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్‌ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. 

బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్‌ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్‌) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్‌ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement