విశిష్టమైన ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయాలి
ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు భారత్‌ను ఎంతగానో విశ్వసిస్తున్నాయని, అదే మన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) మోడల్స్ విశిష్టంగా ఉండాలని చెప్పారు. సమాజ పురోగతి కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. డేటా గోప్యత సూత్రాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేసే ఏఐ మోడల్స్ రూపొందించాలని సూచించారు.
అదేసమయంలో నైతికతను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక, స్వదేశీ కంటెంట్‌కు విశేషమైన ప్రాచుర్యం కలి్పంచాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను పరిపుష్టం చేయడానికి ఏఐ అనేది చక్కటి వేదిక అని ఉద్ఘాటించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు–2026’త్వరలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం ఇండియన్ ఏఐ స్టార్టప్‌ల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని, ఆ దిశగా ఇప్పటినుంచే అంకితభావంతో కృషి చేయాలని స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. చౌకైన, సమగ్రమైన ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. భారతదేశ భవిష్యత్తుకు స్టార్టప్‌లు, ఏఐ ఔత్సాహికులే సహ రూపకర్తలు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఏఐ ఇంపాక్ట్ సదస్సును వచ్చే నెలలో నిర్వహించబోతున్నామని, దీనిద్వారా టెక్నాలజీ రంగంలో మన ప్రాధాన్యం మరింత పెరుగుతుందని స్పష్టంచేశారు. అవతార్, భారత్‌జెన్, ఫ్రాక్టల్, గాన్, గెన్‌లూప్, జ్ఞాని, ఇంటెల్లిహెల్త్, సర్వం, శోధ్ ఏఐ, సాకేత్‌ఏఐ, టెక్ మహీంద్ర తదితర సంస్థలు, స్టార్టప్‌ల సీఈఓలు, ప్రతినిధులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
స్టార్టప్‌ల పనితీరు అద్భుతం
యువతీ యువకులతో కృత్రిమ మేధ గురించి విస్తృతంగా చర్చించానంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదొక మర్చిపోలేని భేటీ అని ఉద్ఘాటించారు. ఏఐ ప్రపంచంలో వస్తున్న మార్పులు, అందులో భారత్ పాత్ర గురించి అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ–కామర్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ స్టిమ్యులేషన్స్, మెటీరియల్ రీసెర్చ్, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన వంటి వేర్వేరు రంగాల్లో మన స్టార్టప్‌లు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రశంసించారు.
చుట్టూ ఉన్న సమాజంలో సానుకూల మార్పుల కోసం ఏఐని ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించామని వివరించారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్’స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.


