ప్రపంచ టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలిచిన సిలికాన్ వ్యాలీ.. దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలు & ఆవిష్కర్తలకు నిలయంగా ఉంది. అయితే తాజాగా వెలువడిన కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. ఇద్దరు ప్రముఖ టెక్ బిలియనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయంగా.. చర్చనీయాంశంగా మారింది.
సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లలో ఒకరు పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్, మరొకరు గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్.
పీటర్ థీల్, లారీ పేజ్ ఇరువురూ.. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి కారణం క్యాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ''బిలియనీర్ ట్యాక్స్'' అని తెలుస్తోంది. ఈ పన్ను ప్రకారం.. ఒక బిలియన్ డాలర్లకు మించిన ఆస్తి కలిగిన వ్యక్తులపై అదనపు సంపద పన్ను విధించాలనే యోచన ఉంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నప్పటికీ.. సంపన్నులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతుందని, పెట్టుబడులు & వ్యాపార స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పీటర్ థీల్, లారీ పేజ్ వంటి బిలియనీర్లు సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
బిలియనీర్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం.. క్యాలిఫోర్నియా నుంచి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోవడమే. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవేళా ఈ బిలియనీర్లు నిజంగా నగరాన్ని విడిచిపెడితే, ఇతర టెక్ వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఫలితంగా క్యాలిఫోర్నియా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా, సిలికాన్ వ్యాలీకి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా దేశం వీడిన బిలియనీర్ల జాబితాలో ప్రముఖ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. యూకే ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయం వల్ల.. ఆయన దేశం విదిచిపెట్టి దుబాయ్ చేరుకున్నారు. 2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
ఇదీ చదవండి: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?


