
భారతదేశ స్టార్టప్, వ్యాపార రంగంలో యువతరం శక్తి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. హురున్ రిచ్ లిస్ట్ 2025 విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్‌లో అత్యంత ధనిక యువ వ్యాపారవేత్తలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. సాంకేతికత, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ, నిర్మాణ రంగాలు.. వంటి వాటిలో తమదైన ముద్ర వేస్తున్నారు.
అతి పిన్న వయస్కుడిగా కైవల్య వోహ్రా రికార్డు
కైవల్య వోహ్రా కేవలం 22 ఏళ్ల వయస్సులోనే రూ.4,480 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తన ‘జెప్టో’ స్టార్టప్ నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంలో నగర జీవన విధానాన్ని మార్చేసింది. జెప్టో సహ-వ్యవస్థాపకుల్లో మరొకరు ఆదిత్ పలిచా (23). రూ.5,380 కోట్ల సంపదతో ముందుకు సాగుతున్నారు.
రితేష్ అగర్వాల్ (31): ప్రిజం (OYO) వ్యవస్థాపకుడు. రూ.14,400 కోట్ల నికర విలువతో గ్లోబల్ ఆతిథ్య రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ స్టార్టప్‌లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన దార్శనికత ముఖ్యమైనది.
అరవింద్ శ్రీనివాస్ (31): శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పెర్‌ప్లెక్సిటీ ద్వారా రూ.21,190 కోట్లు సేకరించి గ్లోబల్ టెక్ మార్కెట్‌లో భారతదేశ ప్రతిభను తెలియజేశారు.
త్రిష్నీత్ అరోరా (30): చండీగఢ్‌కు చెందిన ఈయన తన సైబర్ సెక్యూరిటీ సంస్థ టాక్ సెక్యూరిటీ ద్వారా రూ.1,820 కోట్ల సంపదను ఆర్జించారు.
శాశ్వత్ నక్రానీ (27): ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ భారత్‌పే సహ వ్యవస్థాపకుడిగా రూ.1,340 కోట్ల నికర విలువతో చిన్న వ్యాపారాల చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్నారు.
రోహన్ గుప్తా & ఫ్యామిలీ (26): ఎస్‌జీ ఫిన్‌సర్వ్ ద్వారా రూ.1,140 కోట్ల సంపదతో డిజిటల్ ఫైనాన్షియల్ సేవలను ఆధునీకరిస్తున్నారు.
హార్దిక్ కొఠియా అండ్ ఫ్యామిలీ (31): సూరత్ కేంద్రంగా ఉన్న రేజోన్ సోలార్ ద్వారా రూ.3,970 కోట్ల సంపదతో పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించి పర్యావరణ అనుకూల ఆవిష్కరణ లాభదాయకతను నిరూపించారు.
హర్షారెడ్డి పొంగులేటి (31): హైదరాబాద్‌కు చెందిన ఈయన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా రూ.1,300 కోట్ల నికర విలువతో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశ వృద్ధికి దోహదపడుతున్నారు.
ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!