
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.
నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..
కెనడా
అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, నెట్‌వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.
కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.
జర్మనీ
యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్‌మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఆస్ట్రేలియా (Australia)
ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్‌కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.
యూకే (United Kingdom)
యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్‌కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.
స్వీడన్ (Sweden)
స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.
నెదర్లాండ్స్ (Netherlands)
నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.
సింగపూర్, యూఏఈ
ఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్‌లో ఫైనాన్స్, ఫిన్‌టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్‌లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.
ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర