ఆయుర్వేద వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య మేళా 2026ను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అధికారికంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షెగావ్ పట్టణం విశావా గ్రౌండ్, భక్తినివాస్ కాంప్లెక్స్‌లో ఈ మేళా ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు కొనసాగనుంది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, అఖిల్ భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థలు బైద్యనాథ్, సిద్ధాయి ప్రధాన ప్రాయోజకులు (స్పాన్సర్షిప్)గా వ్యవహరించాయి. తమ స్టాళ్లలో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, ఆయుర్వేదంపై అవగాహన కల్పించే పుస్తకాలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాయి.
ఈ మేళా ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


