ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది. వేతన జీవులు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇకపై ఫారమ్ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్‌లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్‌కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్ ట్యాక్స్ విత్‌హోల్డింగ్ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.


