నా వయసు 65 సంవత్సరాలు. నేను రిటైర్ట్ ప్రభుత్వోద్యోగిని. నా భార్యకు 55 ఏళ్లు. తను టీచర్‌గా పని చేస్తోంది. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి కానీ నియంత్రణలోనే ఉన్నాయి. నా భార్య కొంచెం లావుగా ఉంటుంది. మోకాళ్ల నొప్పి తప్ప ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేదు. మాది ప్రేమ వివాహం. పెళ్లైన మొదట్లో మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగిన తర్వాత మా మధ్య మానసికంగా, శారీరకంగా దూరం పెరిగింది. ఆమె పిల్లలతో కలిసి పడుకునేది. మేము ఏ నెలకో రెండు నెలలకో ఒకటి రెండుసార్లు కలిసేవాళ్లం. ఇటీవలే మా పిల్లలకు పెళ్లిళ్లు చేశాం. వాళ్లు బాగానే సెటిల్ అయ్యారు. నా భార్యకు ఐదేళ్ల క్రితం మెనోపాజ్ వచ్చింది.
అప్పటినుంచి ఆమె నన్ను పూర్తిగా దూరం పెట్టింది. ఇప్పుడు మా ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం. నాతో ఒకే బెడ్‌మీద పడుకోదు. ఎప్పుడైనా నేను ప్రేమగా దగ్గరకు వెళితే– కాటికి కాళ్లు చాపే వయసులో ఇంకా నీకు ముద్దు మురిపాలు కావాలా– అంటూ చికాకుతో విదిలించి కొడుతుంది. మా పెళ్లయి ఇన్నేళ్లయినా నేను వేరే స్త్రీని ముట్టుకున్నది లేదు. కనీసం ఊహించుకున్నది కూడా లేదు. భార్యతో కలసి సరదాగా గడపాలని కోరుకోవడం తప్ప! అది కూడా ఆమెకు ఇష్టం ఉండదు. నా భార్య, నా పిల్లలు కలిసి నన్ను ఒక సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన మా పిల్లల కంటె కొంచెం పెద్దవారు. కనీసం నా వెర్షన్‌కూడా వినకుండా నాకే క్లాస్ పీకారు మీరు కోరికలు తగ్గించుకోవాలి అని చెప్పి నాకు ఏవో మాత్రలు రాశారు. నాకు ఈ విషయమై చాలా బాధగా ఉంది. నా కోరికలో ఏమైనా తప్పుందా? నా విషయంలో నా భార్యా పిల్లల వైఖరి సరైనదేనంటారా? మీ అభిప్రాయం, సూచనలు, సలహాల కోసం గంపెడంత ఆశతో రాస్తున్నాను.
– ఎన్.ఎస్.ఎన్.మూర్తి, విజయనగరం
మూర్తిగారూ, మీరు రాసిన ప్రశ్నలో ఎక్కడా అశ్లీలత లేదు. మితిమీరిన కోరికలు లేవు. బాధ్యత లేని ప్రవర్తన లేదు. మీరు మీ భార్యతో ప్రేమను, సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. అవి దొరకక పోవడంతో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వయసు పెరిగినంత మాత్రాన ప్రేమ, జీవిత భాగస్వామితో దగ్గరగా ఉండాలనే భావన పూర్తిగా పోదు. అది సహజమే. అయితే మెనోపాజ్ తర్వాత హార్మోన్లలో ర్పడిన అసమతుల్యత వల్ల ఆమెలో వచ్చిన శారీరక, మానసిక మార్పులను మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆమెది కేవలం మెనోపాజ్ వల్ల వచ్చిన సమస్యగా మాత్రమే చూడలేం.
పిల్ల బాధ్యతల కారణంగా మీరిద్దరూ ఇప్పటి వరకూ భార్యాభర్తల కంటే తల్లిదండ్రుల్లా ఎక్కువగా జీవించారు. మీ మధ్య మాటలతో పాటు భావోద్వేగ అనుబంధం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లలు వెళ్లిపోయిన తర్వాత మీరు మళ్లీ భార్యాభర్తలుగా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మీ భార్య ఇంకా అమ్మ పాత్రలోనే నిలిచిపోవడం వల్ల ఒక భార్య ఇవ్వాల్సిన ప్రేమ, ఆ΄్యాయతల వంటివి ఆమె పూర్తిగా మరచిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మీరు అన్నీ ఆశించేటప్పుడ ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా మంది దంపతుల్లో కనిపించే సమస్యే. ఆమెను తప్పు పట్టడడం కానీ, నిందించడం కానీ సరైనది కాదు.
ఇది కేవలం మాత్రలతో తగ్గిపోయే సమస్య కూడా కాదు. ఆమె వైపు నుంచి కూడా సమస్యను అర్థం చేసుకోవల్సి ఉంటుంది. మీ ఇద్దరూ కలిసి ఒకసారి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అక్కడ మీ ఇద్దరూ భద్రంగా, స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పిస్తారు. మీ మధ్య ఉన్న అపోహను తొలగించి, ఒక సమతుల్యమైన పరిష్కారం కోసం అందరం కలిసి ప్రయత్నిద్దాం. చివరిగా ఒక మాట... వృద్ధాప్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. అన్ని బరువు బాధ్యతలూ తీరిన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరయ్యే మంచి సమయం అది. జీవితపు చివరి రోజులు ప్రేమతో అన్యోన్యంగా గడపాల్సిన సమయం అలా అన్నీ మంచిగా జరగాలని కోరుకుందాం!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ:
sakshifamily3@gmail.com


