ఎవరీ అక్షితా ధంకర్‌..? గణతంత్ర వేడుకల్లో ద్రౌపది ముర్ముతో కలిసి.. | Akshita Dhankar Unfurl the National Flag with Droupadi Murmu on Republic Day | Sakshi
Sakshi News home page

ఎవరీ అక్షితా ధంకర్‌..? గణతంత్ర దినోత్సవం రోజున ద్రౌపది ముర్ముతో కలిసి..

Jan 23 2026 12:24 PM | Updated on Jan 23 2026 1:02 PM

Akshita Dhankar Unfurl the National Flag with Droupadi Murmu on Republic Day

భారత్‌ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయితే ఈ వేడుకలో ప్రదర్శించే కవాతు, సీఆర్పీఎఫ్‌, మార్చ్‌ ప్రదర్శనలు హైలెట్‌గా ఉండటమేగాక..సిందూర్‌ ఆపరేషన్‌లో తెగువ చూపిన వీరులు కవాతు ప్రదర్శనలు కూడా ప్రజలను అమితంగా ఆకట్టుకోనున్నాయి. ఈసారి మహిళా శక్తికి అర్థం వివరించేలా..సాయుధ రంగంలోని వారికి అత్యున్నత గౌరవాన్నిచ్చే సేవలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం విశేషం. 

ఆ నేపథ్యంలోనే పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్‌ బృందానికి సారధిగా 26 ఏళ్ల సిమ్రాన్‌ బాలా వ్యవహరిస్తుండగా..తాజాగా ఈ వేడుక రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించే అత్యున్నత అవకాశం మరో  యువ మహిళను వరించింది. ఆమెకు కూడా ఈ అవకాశం తన ప్రతిభా సామర్థ్యం, చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి చేరిన సేవా తత్పరతల కారణంగానే దక్కింది. ఎవరా మహిళ..? సాయుధ రంగంలో ఎలాంటి సేవలందిస్తారామె..?

జనవరి 26, 2026న, భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, అంకితభావాన్ని సూచించే సాయుధ దళాల కర్తవ్య పథంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంలో భారత రాష్ట్రపతికి సహాయం చేసే అత్యున్నత అవకాశాన్ని ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ దక్కించుకున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆమె సాయుధ దళంలోకి ప్రవేశించి అత్యున్నత స్థాయికి చేరి చెరగని ముద్రవేసింది. 

ఈ హర్యానా వాసి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)ఎన్‌సీసీ వైపు ఆకర్షితురాలై అందులో చేరింది. ఎన్‌సీసీలో తన అపారమైన సేవతో మెప్పించి..క్యాడెట్ సార్జెంట్ మేజర్ (CSM)గా ప్రతిష్టాత్మక స్థాయికి  చేరుకుని తోటి క్యాడెట్లకు స్ఫూర్తిగా నిలిచారామె. ఆ ఎన్‌సీసీ శిక్షణే సాయుధ దళంలోకి చేరేలా ప్రేరేపించింది. అలాగే ఆమె తండ్రి కూడా రిపబ్లిక్‌ పరేడ్‌లో పాల్గొన్నప్పుడే ఈ రంగంపై అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. అదే ఆమెను ఆ యునిఫాం ధరించేలా సాయుధ కెరీర్‌ని ఎంచుకునేలా చేశాయి. 

అలా ఆమె దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌సీఏటీ)కు హాజరయ్యారు. ఇది ఐఏఎఫ్‌లో ఆఫీసర్‌ స్టాయిలో పనిచేసే అవకాశం కల్పించే పోటీ పరీక్ష. ఆమె ఆ పరీక్షలో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణ సాధించి అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌లో పనిచేసే అవకాశం అందుకుంది. ఆ తర్వాత జూన్ 17, 2023న షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రౌండ్‌ డ్యూటీ కోర్సులో భాగంగా  ఫ్లయింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 

నిజానికి ధంకర్‌ చాలా తక్కువ వ్యవధిలోనే ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాకు చేరుకున్న అధికారిణి. అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌లో ధంకర్‌ కార్యచరణ అధికారుల మన్ననలను అందుకుంది. అలా ఆమె ఐఏఎఫ్‌ అధికారణిగా కెరీర్‌లో అందుకున్న సక్సెస్‌ ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యేలా చేసింది. పైగా ఇది అత్యున్నత ఉత్సవ గౌరవంలో ఒకటైన సేవ కారణంగా ఒక్కసారిగా ధంకర్‌ పేరు వార్తల్లో నిలిచింది. 

అంతేగాదు ఆమె స్వస్థలంలో సైతం ఈ అత్యున్నత సేవ గౌరవానికి ఎంపికైనందకు అక్కడి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. అక్కడ కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే యత్నంలో ఉండటం విశేషం. కాగా, 2026 నాటికి, IAF సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది మహిళలు ఉన్నారు. 

ముఖ్యంగా అగ్నిపథ్ పథకం వంటి చొరవల ద్వారా వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పోరాట పాత్రలను విస్తరించడంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఇలాంటి జాతీయ కార్యక్రమాలలో ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధంకర్ వంటి అధికారుల భాగస్వామ్యం అనేది అర్థవంతమైన సమానత్వం వైపు పురోగతిని సూచిస్తోంది అనడంలో అతిశయోక్తి కాదు.   

(చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement