జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్‌చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది.
ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా.
తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్‌స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్‌ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు.
నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..
ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు.
ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు.
ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..
తన పోస్ట్‌లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు.
ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్‌ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్‌ను దెబ్బతీస్తుంది.
ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుంది
ఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరు
చివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్‌ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం.
(చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..)


