రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ప్రైవేటు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు, డేటా దొంగతనాలు గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. 2020–24 మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలపై 5.77 లక్షల సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు.
చాట్ జీపీటీ, ఏఐ వాడితే రహస్య సమాచారం లీక్
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చాట్ జీపీటీ, ఏఐ వంటి టూల్స్ వాడటంవల్ల రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రహస్య, సున్నిత సమాచారం దేశం బయటకు చెప్పడం, సురక్షితం కాని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం నిషేధమని తెలిపారు.
భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం
ఇటీవల జరిగిన భారత్–బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పంద సమావేశం (సీఈటీఏ)లో క్రాస్–బోర్డర్ డేటా ప్రవాహాలు, డేటా లోకలైజేషన్ నియమాలను పునఃసమీక్షించే అవకాశాలపై ఒప్పందం జరిగినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద జవాబిచ్చారు.
ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఎన్‌ఐఎల్)లోని 32 డివిజన్లనను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు, ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు నిజంకాదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ప్రైవేటీకరణకు ప్రతిపాదనలేవీ లేవని చెప్పారు.
రైతులకు సహాయం
2022–23 నుంచి 2024–25 మధ్య ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా దాదాపు రూ.609 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు కేంద్ర వ్యవసాయ, సంక్షేమశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.


