సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయా సంఘాల్లో తమ తమ హోదాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలా కొందరు ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగులకు అడ్డంపడి పోతున్నారని తెలిపింది.
ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. ఈ రెండు కేటగిరిలకు మినహాయింపుల వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాల వివరాలు తెలియచేయాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
హైకోర్టుకు చేరిన ఇద్దరు అధికారుల మధ్య వివాదం...
విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ (జెడ్‌ఎస్‌డబ్యూఓ)గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. కృష్ణారావు స్థానంలో కేవీఎస్ ప్రసాదరావును విజయనగరం జెడ్‌ఎస్‌డబ్యూఓగా నియమించారు. కృష్ణారావు కాకినాడలో బాధ్యతలు చేపట్టకుండా విజయనగరంలోనే ఉండటంతో వివాదం మొదలైంది. పైగా ఈ బదిలీపై హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన సింగిల్ జడ్జి... పిటిషనర్ కృష్ణారావును విజయనగరంలో కొనసాగించే విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సంబంధిత ప్రొసీడింగ్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాదరావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.


