ఆపరేషన్ సమయంలో బ్లేడ్ లోపల పెట్టి కుట్లేసిన వైద్యులు
నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో దారుణం
చంద్రబాబు పాలనలో రోజురోజుకు దిగజారుతున్న ప్రభుత్వాస్పత్రులు
నరసరావుపేట టౌన్: సీఎం చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రులు నానాటికీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేదల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల కాకినాడ తుని ఏరియా ఆస్పత్రిలో యువకుడి కాలికి శస్త్రచికిత్స చేసి సర్జికల్ బ్లేడ్ శరీరం లోపలే వదిలేసిన ఘటన మరువకముందే... పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను ఆమె శరీరంలోనే వదిలేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.
నరసరావుపేట పట్టణంలోని బాలయ్యనగర్‌కు చెందిన రమాదేవికి ఈ నెల 26వ తేదీన ఏరియా ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి తీవ్రంగా నొప్పి వస్తోందని రమాదేవి మళ్లీ వైద్యులను సంప్రదించింది. వైద్యులు పరీక్షలు చేయకుండానే ఆపరేషన్ తర్వాత నొప్పి సహజమని చెప్పి పంపారు. అయితే, రమాదేవి నొప్పితో అల్లాడుతుండటంతో బంధువులు స్కానింగ్ చేయించారు. తొడ భాగంలో సర్జికల్ బ్లేడ్ ఉందని స్కానింగ్ రిపోర్టులో బయటపడింది.
వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా, ఆపరేషన్ చేసి ఆ బ్లేడ్ తొలగించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ సమయంలో సర్జికల్ బ్లేడ్ శరీరంలో వదిలేశారని రమాదేవి బంధువులు శుక్రవారం ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆపరేషన్ చేసేందుకు వైద్యులు, సిబ్బంది రూ.2,500 లంచం కూడా తీసుకున్నారని రమాదేవి చెప్పారు.


