డిస్ట్రిక్ట్ యాప్‌లో కనబడుతున్న టికెట్ల పరిస్థితి ఇదీ...
వన్డే క్రికెట్ టికెట్ల అమ్మకాల్లో ఏసీఏ దొంగాట
డిస్ట్రిక్ట్ యాప్‌లో విక్రయిస్తున్నామంటూ ప్రచారం
అరగంటపాటు ఆన్‌లైన్‌లో వేచిచూసినా నిరాశే
‘ఇతర ఫ్యాన్స్’ బుకింగ్ చేస్తున్నారంటూ సమాచారం
గడువు ముగిసేవరకు ఇదేవరస
టికెట్లు దొరక్క క్రికెట్ అభిమానుల ఆవేదన
దొంగచాటుగా విక్రయిస్తున్నారనే విమర్శలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ అభిమానులతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆటలాడుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నామని చెబుతున్న ఏసీఏ.. చివరకు బుకింగ్‌కు వెళ్లేసరికి మొండిచేయి చూపుతోంది. గంటలకొద్దీ వేచిచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో క్రికెట్ బుకింగ్ ప్రారంభమవుతుందన్న సమయానికి అరగంట ముందు నుంచే ఆన్‌లైన్‌లో వేచిచూస్తున్న అభిమానులకు మొదట్లో మీముందు ఇంకా 30 వేలమంది ఉన్నారంటూ సమాచారం వస్తోంది.
మరో అరగంటకుపైగా వేచిచూసిన తర్వాత... సరిగ్గా టికెట్లు సెలెక్ట్ చేసుకుని బుకింగ్ చేసే సమయానికి.. ‘హోల్డ్ రైట్.. టికెట్లను హోల్డ్‌లో ఉంచాం. ఇతర ఫ్యాన్స్ వారి బుకింగ్‌ను పూర్తిచేస్తున్నారు. అప్పటివరకు ఆగండి..’ అంటూ సమాచారం వస్తోంది. బుకింగ్ కోసం కేటాయించిన 10 నిమిషాలు పూర్తయ్యేవరకు ఈ సమాచారమే కనిపిస్తోంది.
చివరకు సమయం అయిపోవడంతో టికెట్లు బుకింగ్ కాకుండానే ఫ్యాన్స్ నిరాశకు గురికావాల్సి వస్తోంది. అయితే ‘ఇతర ఫ్యాన్స్’ ఎవరు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇతర ఫ్యాన్స్ పేరిట టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్‌లైన్ పేరుతో ఆటలు
వాస్తవానికి భారత్–దక్షిణాఫ్రియా సిరీస్‌లో విశాఖ వేదికగా జరగనున్న మూడో వన్డే కీలకంగా మారింది. ఇప్పటికే రెండుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ గెలిచేందుకు విశాఖ వన్డే ఫలితమే కీలకంగా మారింది. దీంతో ఈ వన్డేను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా రోహిత్, కోహ్లి (రో–కో) ఈ మ్యాచ్‌లో ఆడుతుండటంతో అభిమానుల నుంచి టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. అదేవిధంగా విశాఖ స్టేడియంలో భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఇప్పటివరకు ఈ స్టేడియంలో భారత్ 10 మ్యాచ్‌లు ఆడగా... 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. ఇదే స్టేడియంలో రోహిత్‌కు, కోహ్లికి వ్యక్తిగతంగా మంచి రికార్డులున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్‌పై సహజంగానే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంది. సరిగ్గా ఇదే అభిమానాన్ని ఏసీఏ సొమ్ముచేసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వివిధ స్టాండ్ల టికెట్ ధరలను పెంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. దీనికితోడు ఏసీఏలోని కొందరు వ్యక్తులు ఆన్‌లైన్ ధరలకు టికెట్లను కొనుగోలు చేసి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో సరిగ్గా టికెట్లను బుక్ చేసుకునే సమయానికి ‘ఇతర ఫ్యాన్స్’ పేరిట తరలివెళుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


