తిరుమల: తిరుమలలో శుక్రవారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది. టీటీడీ మూడంచెల భద్రతను దాటుకుని ఓ భక్తుడు కెమెరాతో వచ్చాడు. వివరాల్లోకెళ్తే.. జైపూర్‌కు చెందిన శుభం ఖండేల్వాల్ అలియాస్ సర్వలక్షణ్ దాస్, ఒంగోలుకు చెందిన భాను సుందర్ అలియాస్ అర్జున్ బంద్ దాస్ అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు. వీరు శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రత తనిఖీలను దాటుకుని తిరుమలకు డ్రోన్ కెమెరాను తీసుకొచ్చారు.
శుభం ఖండేల్ వాల్ స్థానిక శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగురవేసి చిత్రీకరించడం ప్రారంభించాడు. దీనిని గుర్తించిన భక్తులు.. టీటీడీ భద్రతాధికారులకు సమాచారం అందించగా, వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్‌లో చిత్రీకరించిన వీడియోలను పరిశీలించి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.


