ఎప్పుడూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కిందే పోస్టుల భర్తీనా?
విద్యా సంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారు
విద్యా వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం
యూనివర్సిటీలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం
రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌వీయూ తీరుపై హైకోర్టు ఆగ్రహం
అకడమిక్ కన్సల్టెంట్ల నియామక ప్రక్రియపై స్టే
సాక్షి, అమరావతి: బోధనా సిబ్బంది పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్దతుల్లో భర్తీ చేస్తుంటే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తాత్కాలిక పోస్టులతో యువతను దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసంబద్ధ నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారంటూ మండిపడింది. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయం పేరు చెప్పి ఆ హక్కులను కాలరాయలేరని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
పోస్టుల భర్తీ ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం తగదని ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే నిమిత్తం.. లేని పోస్టులను ఎలా సృష్టిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పోస్టే లేకుంటే దానిని తాత్కాలికంగా భర్తీ చేయడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదంది.
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ)లోని పలు విభాగాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ అక్టోబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును ఈ సందర్భంగా నిలిపివేసింది. దీనికి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌వీయూ రిజిస్ట్రార్‌లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పీల్ నేపథ్యం ఇదీ..
⇒ ఎస్‌వీయూ అక్టోబర్ 31 నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో అకడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న డాక్టర్ కె.కిషోర్ కుమార్‌రెడ్డి, డాక్టర్ ఎస్.శివశంకర్, మరో ప్రైవేటు ఉద్యోగి రెడ్డివారి అర్జున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
⇒ ఈ పిటిషన్‌పై జోక్యానికి గత నెల 26న సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించింది.
⇒ దీనిపై హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది
⇒ అప్పీల్‌దారుల తరఫు న్యాయవాది మునకల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. అన్నీ అర్హతలున్నా ప్రస్తుత నియామకాలకు సంబంధించి పిటిషనర్లను అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదని ధర్మాసనానికి విన్నవించారు.


