జోజి నగర్ బాధితులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
కబ్జాకోరులకు చంద్రబాబు సర్కారు వెన్నుదన్ను
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు
భవానీపురంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు పరామర్శ
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు.
బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు.


