వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న బాధితులు
వైఎస్ జగన్‌కు విజయవాడ భవానీపురం బాధితుల మొర
ప్లాట్లు కొని అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నాం
23 ఏళ్ల తర్వాత సొసైటీ పేరిట వచ్చి ఖాళీ చేయమన్నారు
కోర్టు ఉత్తర్వులు ఉన్నా... మా ఇళ్లను నేలమట్టం చేశారు
మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం
న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతిపత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: ‘‘ఎన్నో ఏళ్లపాటు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న గూడును నేలమట్టం చేసి రోడ్డు పాల్జేశారు. బాబు సర్కారు వచ్చాక మాపై దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. ఇళ్లలోని సామగ్రి మొత్తం నష్టపోయి మూడు రోజులుగా భార్యాబిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని మాట సాయం చేసిన పాపాన పోలేదు. మాకు మీరే న్యాయం చేయాలి. మా జీవితాలను నిలబెట్టాలి’’ అని వైస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విజయవాడ భవానీపురం జోజినగర్‌లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు వేడుకున్నారు. శుక్రవారం ఉదయం 42 ప్లాట్ల యజమానులు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ‘‘మేం 23 ఏళ్ల క్రితం భవానీపురం జోజినగర్ వద్ద అబ్దుల్ మజీద్ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు నిర్మించుకున్నాం. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం. కానీ, మా స్థలాలు శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవని, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఖాళీ చేయాలని, లేదంటే కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. మమ్మల్ని కిరాయి గూండాలతో వచ్చి అనేకసార్లు బెదిరించారు. పోలీసులను కలిశాం. చాలామంది నాయకులకు చెప్పినా న్యాయం జరగలేదు.
కోర్టు ఉత్తర్వులున్నా వినలేదు...
మా విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించవద్దని గత నెల 3న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 3వ తేదీన బుధవారం 300 మందిపైగా పోలీసులు, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆరు జేసీబీలతో వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తాయని, కాళ్లావేళ్ల్ల ప్రాథేయపడి నాలుగు గంటల సమయం కోరినా కనీసం మానవత్వం చూపలేదు. వందలాది పోలీసులతో వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో సామాన్లను కూడా బయటికి తెచ్చుకోనివ్వలేదు.
పిల్లలకు పాలు, మంచినీళ్లు అందించే అవకాశం ఇవ్వకుండా మా ఇళ్లను మా కళ్లముందే కూల్చివేశారు. చర్చిని అయినా కూల్చొద్దని ప్రాథేయపడ్డాం. కానీ, మాకెవరు అడ్డు వస్తారో చూస్తామంటూపడగొట్టారు. డిసెంబరు 31 వరకు 42 ప్లాట్లపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పూర్తి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పటికే అంతా అయిపోయింది’’ అని వాపోయారు. ప్లాట్ల యజమానులు వైఎస్ జగన్‌ను కలిసిన సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, వెలంపల్లి, భాగ్యలక్షి్మ, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు.


