‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’ | Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’

Dec 5 2025 4:55 PM | Updated on Dec 5 2025 5:35 PM

Ambati Rambabu Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.

‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు.

..తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు  కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు.

..వైఎస్‌ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్‌ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?

..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్‌లోని ఇంట్లోకి పవన్‌కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్‌ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్‌ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం‌ కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement