సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దానం తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అనర్హతల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం నా రక్తంలోనే ఉంది. 11 సార్లు ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర నాకు ఉంది. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై పెద్ద చర్చే నడుస్తోంది. బీఆర్ఎస్‌లో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా?.. లేదా ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా?.. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో వీరే అభ్యర్థులుగా ఉంటారు. మరి అనర్హత వేటు పడితే కూడా వీరికి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది.
ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. సుప్రీం గడువు అక్టోబర్ 30 తేదీకే ముగియడంతో స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో, సుప్రీంకోర్టు మరో 4 వారాల సమయం ఇస్తూనే స్పీకర్ కార్యాలయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. అయితే, పార్టీ ఫిరాయించిన అంశంపై అనర్హత వేటు పడితే.. వచ్చే ఉపఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం ఉండదు .. అదే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే.. దాన్ని స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అర్హులు అవుతారు.


