సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొంత శ్రీనివాసులును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమార్జనకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూములు, నగదు, కార్లు, ప్లాట్లను గుర్తించారు. అందుకు సంబంధించిన లెక్కల్ని చూపడంలో శ్రీనివాసులు విఫలం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అనంతరం అరెస్టు చేశారు.
వివరాల ప్రకారం.. శ్రీనివాసులు కూడబెట్టిన అక్రమాస్తులను అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా కమ్యూనిటీలో ఉంటున్న శ్రీనివాసులు ఇంటితో పాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని అతని సన్నిహితులు, బినామీలు, బంధువుల ఇళ్లలో మొత్తం ఏడు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
అనంతరం, అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయనకు రాయదుర్గంలో ఒక ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11, మహబూబ్‌నగర్‌లో 4, నారాయణపేటలో 3 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. సోదాల సందర్బంగా 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, రెండు కార్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి.
ఇదిలా ఉండగా.. శ్రీనివాసులు తన సర్వీసులో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. తొలుత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పని చేసిన శ్రీనివాసులు, అదే జిల్లాలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరించారు. సర్వే విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే పని చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటూనే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సైతం ఇన్‌ఛార్జిగా ఉన్నారు. సర్వే నంబర్లను మార్చి చూపడం, తప్పుడు సర్వే నివేదికలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడం ద్వారా శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు గతంలో హైడ్రాకు తప్పుడు సమాచారమిచ్చారని ఇతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదై ఉంది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట స్థలాన్ని ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టేందుకు శ్రీనివాసులు కొందరికి సహకరించినట్లు గతేడాది హైడ్రాకు ఫిర్యాదు అందింది.


