203 రోజులు సాధారణ, 23 రోజులు అనారోగ్యకరంగా
గుడ్ ఏక్యూఐ ఒక్క రోజు కూడా లేదు
ఏడాదిలో పూర్ ఎయిర్ క్వాలిటీ 110 రోజులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగానే మారుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు హైదరాబాద్ సరాసరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఒక్క రోజు కూడా నాణ్యమైన గాలి (గుడ్ ఎయిర్) లేదని నివేదికలు చెబుతున్నాయి. గడచిన నాలుగేళ్లలో డిసెంబరు నెల వాయు కాలుష్యం (ఏక్యూఐ) పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలిగా పేర్కొంటారు. ఈ ఏడాది జనవరి నుంచి గడచిన 337 రోజుల్లో 203 రోజులు సాధారణ స్థాయిలో ఉండగా, 110 రోజులు పూర్ ఏక్యూఐ నమోదు కాగా.. 23 రోజులు అన్‌హెల్దీగా పేర్కొంటున్నారు. 2022 నుంచి డిసెంబరు నెల వాయు నాణ్యత సూచీ పరిశీలిస్తే ఈ ఏడాది 185గా ఉంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వాయు కాలుష్యం నమోదు కాలేదు.
నగరంలోని ఫైనాన్సియల్ జిల్లాలో బుధవారం వాయు నాణ్య సూచీ 253గా నమోదు కావడం విశేషం. అదే సమయంలో అమీన్‌పూర్‌లో 201గా ఉంది. హైదరాబాద్ సైతం వాయు కాలుష్యంలో ఢిల్లీ వైపు అడుగులు వేస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమాజిగూడ, బొల్లారం, పాశమైలారం, బంజారాహిల్స్, సనత్‌నగర్, బొల్లారం, రామచంద్రాపురం ఇతర ప్రాంతాల్లోనూ 170 నుంచి 189 మధ్య నమోదైంది.
ఇది కూడా చదవండి: వ్యవసాయం అంటే పంటలే కాదు.. వ్యాపారం కూడా..


