మనం మనం బరంపురం
సాక్షి నెట్‌వర్క్: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవే అయినా.. స్థానిక రాజకీయాల దృష్ట్యా పొత్తులు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. ఢిల్లీలో శత్రువులు.. గల్లీలో మిత్రులు అన్నట్టు ఉంది పంచాయతీ ఎన్నికల్లో పొడిచిన పొత్తుల పరిస్థితి..
» మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు చేయి కలిపారు.
» ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అనాసాగరంలో సీపీఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కొన్ని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్, సీపీఎం జత కట్టాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో కొన్నిచోట్ల బీఆర్‌ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి.
» జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గా లుగా విడిపోయింది. పాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కలి సి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లా రాకొండ, సింగారం, వనపర్తి జిల్లా పాన్ గల్ మండలంలోని రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్, మదనా పురం మండలంలోని కొత్తపల్లి, నర్సింగాపురం, అమరచింత మండలం చంద్రగడ్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ ఏకమయ్యాయి.
నారాయణ పేట జిల్లా ఎక్లాస్‌పూర్, గోటూర్.. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకమై పోరులో నిలిచారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గుంటిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్‌గా.. బీజేపీ మద్దతుదారు ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.
» నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో పోటీ చేస్తుండగా మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పోటీ నెలకొంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్– ఎస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్‌ఎస్, సీపీ ఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా, గట్టికల్లు గ్రామంలో బీజే పీ,బీఆర్‌ఎస్, సీపీఎం, కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి.
» మంచిర్యాల జిల్లా భీమిని మండలం లక్ష్మీపూర్, కేస్లాపూర్‌లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు అంతా కలిసే పోటీ చేస్తున్నారు. తాండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సఖ్యత కోసం పావులు కదుపుతున్నారు.
ప్రాణం తీసిన పంచాయతీ ఎన్నికలు?
ఒత్తిడి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ మద్దతుతో పుష్ప పోటీలో ఉంది. అయితే ఆమె భర్త రవీందర్ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. రవీందర్ గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా కూడా చేశాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.
సర్పంచ్ ఓట్లు.. కోతులకు పాట్లు
చిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికలు కోతులకు తిప్పలను తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఓ వ్యక్తి కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించే చర్యలకు ఉపక్రమించాడు. గురువారం గ్రామంలో దాదాపు 500 కోతులను పట్టించి, బోనులో బంధించాడు. వాటిని మంథని, మహదేవ్‌పూర్ అడవులకు ప్రత్యేక వాహనంలో తరలించాడు.
మూడు తరాల సర్పంచ్‌లు
పాపన్నపేట(మెదక్): 3 తరాలుగా సర్పంచ్ పదవులు చేపట్టి పట్లోల్ల కుటుంబం రాజకీయాధిపత్యాన్ని చాటుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన పట్లోల్ల శివరాంరెడ్డి 1959లో గ్రామ మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1964లో ఆయన అన్న బలరాంరెడ్డి కొడుకు రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి కోడలు అనిత సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బలరాంరెడ్డి సొంత తమ్ముడు నారాయణరెడ్డి 1970 నుంచి 1981 వరకు సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం 1981లో మెదక్ సమితి ప్రెసిడెంట్‌గా ఎన్ని కయ్యారు. ఆపై 1989 నుంచి 1994 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం నారాయణరెడ్డి కుమారుడు పట్లోల్ల శశిధర్‌రెడ్డి 2004లో మెదక్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సర్పంచ్ బరిలో కార్వాన్ ఎమ్మెల్యే సతీమణి
వెల్దుర్తి(తూప్రాన్): కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియొద్దీన్ సతీమణి, పాతబస్తీలో రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన నజ్మా సుల్తానా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్ప ంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. బస్వాపూర్ కౌసర్ మొహియొద్దీన్ స్వగ్రా మం కాగా, నజ్మాసుల్తానా గురువారం తన కుమారుడితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు.
కుల సంఘం ఓట్ల కోసం రూ.10 లక్షలకు వేలం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫత్తేపూర్‌లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తనకే గంపగుత్తగా మెజారిటీ ఓట్లు పొందేందుకు ఓ కుల సంఘం నేతలతో కలిసి వేలం పాట జరిపారని సమాచారం. కాంగ్రెస్ బలపర్చిన మరో అభ్యర్థి ఇతర కుల సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రూ.9 లక్షల వరకు వేలం జరిపారు. దీంతో గ్రామంలో మెజారిటీ ఓట్లు ఉన్న కుల సంఘం, ఇతర కుల సంఘాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దారు.
సర్పంచ్ పదవి .. రూ.75 లక్షలు!
చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో పోటీ పెరిగి అభ్యర్థులు తమ సొంత డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇంతటితో ఆగకుండా పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో ముగ్గురు వ్యక్తులు పోటీ పడగా ఓ అభ్యర్థి రూ.75లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలో..
పోతిరెడ్డిపల్లికి చెందిన వేణుమోహన్‌పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా సోషల్ మీడియాలో వేణుమోహన్ పోస్టు చేశారు. దీంతో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నవీన్ తెలిపారు.
నా భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీ
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో తన భార్యను గెలిపిస్తే ఐదేళ్లు కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానంటూ ఓ భర్త వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. 6వ వార్డు నుంచి శ్రీకాంత్ భార్య శివాని బరిలో ఉన్నారు. నాయీ బ్రాహ్మణుడైన శ్రీకాంత్ తన భార్య గెలుపు కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడు.
11 రోజుల పసికందుతో నామినేషన్ కేంద్రానికి..
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ స్థానానికి జాలపల్లి సౌందర్య తన 11 రోజుల చంటి పాప, భర్తతో కలిసి గురువారం నామినేషన్ దాఖలు చేసింది.
ఆడబిడ్డ పెళ్లికి రూ. 25 వేలు.. గృహ ప్రవేశానికి రూ. 10 వేలు
సర్పంచ్‌గా గెలిపిస్తే అమలు చేస్తానని హామీపత్రం
కల్లూరురూరల్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు(వాసు) ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాడు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామంలోని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 25,116, పేదల గృహప్రవేశానికి రూ.10,116 అందచేస్తానని ప్రకటించాడు.
పేదిళ్లలో ఆడబిడ్డ ప్రసవానికి రూ.10,116 ఇవ్వడంతోపాటు పురుషులు, మహిళా వ్యవసాయ కూలీలకు సొంత డబ్బుతో ప్రమాద బీమా చేయిస్తానని, అనారోగ్యంతో అత్యవసర చికిత్స అవసరమైన వారికి రూ.5 వేల నుంచి రూ.10వేలు అందిస్తానని ప్రకటించారు. రూ.100 బాండ్‌పై హామీపత్రం తయారు చేయించి పంపిణీ చేస్తున్నాడు.


