సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై అంతరాయం కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో వందల కొద్దీ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇవాళ ఇంకొన్ని విమానాలు రద్దు కాగా.. ఇంకొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బుక్ చేసుకున్న సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇండిగో విమానాల్లో అంతరాయానికి సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్యలు కారణమని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్లైయింగ్ అకాడమీల నుండి సిబ్బందిని తాత్కాలికంగా రిక్రూట్ చేసుకుంటోంది ఇండిగో. అయితే విమాన సిబ్బంది లేనప్పుడు ఫ్లైట్‌లను బుకింగ్స్‌లో ఎందుకు పెట్టారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టెంపరరీ అని తీసుకొస్తున్నారు.. అసలు వారికి శిక్షణ పూర్తి అయ్యిందో లేదో? అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలపై ఇండిగో అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇండిగో ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి వెయిటింగ్‌లో పడుతున్నారు. ఈ క్రమంలో సహనం నశించి.. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో చెకింగ్ పాయింట్ వద్ద వాగ్వాదానికి దిగారు. పిల్లలతో పడిగాపులు పడుతున్నామని.. వేరే విమానంలో అయినా తమను తరలించాలని కోరుతున్నారు.
ఎఫ్‌డీటీఎల్ (Flight Duty Time Limitations) రూల్స్ అనేవి డీజీసీఏ(Directorate General of Civil Aviation) రూపొందించిన నియమాలు. ఇవి పైలట్లు డ్యూటీ టైమింగ్స్‌తో పాటు కనీస విశ్రాంతి సమయం ఎంత ఉండాలి అనే విషయాల్ని నిర్దేశిస్తాయి. తాజాగా.. పైలట్లకు ఊరట ఇస్తూ ఈ రూల్స్‌లో మార్పులు చేశారు.
అయితే.. ఇండిగో అనేది దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సర్వీస్. రోజుకు 1,800 ఫ్లస్ సర్వీసులు నడుపుతోంది(మిగతావి అన్నీ కలిపి 200-400 సర్వీసులు మాత్రమే). అయితే దీనికి స్టాఫ్ కొరత మొదటి నుంచే ఉంది. ఈ క్రమంలో తాజా రూల్స్‌తో అది సంక్షోభ దిశగా అడుగులు వేసింది. దీంతో ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. తమ విమానాల్లో కొన్నింటికి నిబంధనల నుంచి మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది.


