గురువారం 550కుపైగా ఇండిగో విమానాల రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్‌డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు.
సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.
సమయానికి రాకపోకలను సూచించే ఆన్‌టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 75, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి.
ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్‌పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్‌పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.
ఫిబ్రవరి 10దాకా ఇంతే
సమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది.


