300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు | Over 300 IndiGo flights cancelled across major Indian airports know the reason | Sakshi
Sakshi News home page

300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు

Dec 4 2025 3:27 PM | Updated on Dec 4 2025 4:02 PM

Over 300 IndiGo flights cancelled across major Indian airports know the reason

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కార్యాచరణ, సాంకేతిక సంబంధిత సమస్యల కారణంగా అనేక సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయి ప్రయాణ ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి.

భోపాల్‌కు రూ.1.3 లక్షలు

ఇండిగో కొన్ని విమానాలను రద్దు చేసుకున్న కారణంగా ఎయిర్ ఇండియా అనేక మార్గాల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెంచేసినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్-భోపాల్ మార్గంలో ఎయిర్ ఇండియా ఛార్జీలు దాదాపు రూ.1.3 లక్షలకు చేరుకోవడం ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని సంస్థలు వెల్లడించించిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి భోపాల్‌ వెళ్లే కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌లో రాత్రిపూట టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఎకానమీ: రూ. 1.03 లక్షలు

  • బిజినెస్ క్లాస్: రూ. 1.3 లక్షలు

ఎయిరిండియా పోర్టల్‌లో ఈ అత్యధిక ధరలున్నా కేవలం ఒక సీటు మాత్రమే మిగిలి ఉన్నట్లు చూపించింది.

ఇండిగో విమానాల రద్దు ప్రభావం

హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఇండిగో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీనితో మిగిలిన విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌లో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. విమానాశ్రయ అథారిటీ సైతం ఈ అంతరాయాలను ధ్రువీకరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. అనేక ఇండిగో విమానాలు ‘విమానయాన సంబంధిత సాంకేతికత, కార్యాచరణ సమస్యల వల్ల రద్దు అయ్యాయి’ అని పేర్కొంది.

ఇండిగో ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలను పర్యవేక్షించి ప్రయాణీకుల ఫిర్యాదులను సమీక్షించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement