విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.
ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్‌లో పేర్కొంది.
పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.
ఏమిటీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్?
ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్‌పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్ క్రెడిట్‌ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు.


