విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు,
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనత
బ్లూ చిప్ షేర్లలో అమ్మకాల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, బ్లూ చిప్(అధిక వెయిటేజీ) షేర్లలో షేర్లలో విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.
ఒక దశలో సెన్సెక్స్ 589 పాయింట్లు కోల్పోయి 85,053 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పతనమై 25,998 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఫైనాన్సియల్, సర్విసెస్, బ్యాంకులు, ఇండ్రస్టియల్స్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెలికం, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.49%, 0.14% నష్టపోయాయి. జపాన్ కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్లలో అమ్మకాలు, క్రిప్టో కరెన్సీ పతనంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.
వరుస అయిదు ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.9,642 కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే రూ.3,642 కోట్ల షేర్లను అమ్మేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(–1.25%), రిలయన్స్ ఇండస్ట్రీస్(–1.25%), ఐసీఐసీఐ బ్యాంకు(–1.25%), ఎల్‌అండ్‌టీ(–1%), యాక్సిస్ బ్యాంకు (–1.29%)శాతం నష్టపోయి ఇండెక్సు పతనానికి ప్రధాన కారణమయ్యాయి.


